దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీచేశారు. డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్లయితే తాము కూడా అంతకుమించి ప్రతిదాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. నాటి డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతంలోకి చొచ్చుకొచ్చినవి డ్రోన్లు కాదని, అవి పిల్లలు ఆడుకునే బొమ్మలు అంటూ ఎద్దేవా చేశారు. డ్రోన్ల దాడిని ఇజ్రాయెల్ చేసిన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, దీనిపై టెహ్రాన్ దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే తాము దానికి మించిన ప్రతిదాడులను చేస్తామని వెల్లడించారు. అలా కాకపోతే ఇక్కడితో ముగిస్తామన్నారు.