సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం కృష్ణమ్మ. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. టీజర్, ట్రైలర్ తక్కువ షాట్స్‌లోనే ఎట్రాక్టివ్‌గా తీసి, సినిమా చూడాలనే ఉత్సాహాన్ని పెంచాడు దర్శకుడు గోపాలకృష్ణ. సరైన సినిమా పడితే స్టార్ అయ్యేంత మంచి నటుడు సత్యదేవ్. కృష్ణమ్మతో అది జరగాలని కోరుకుంటున్నా అని అన్నారు. దర్శకులు మలినేని గోపీచంద్, అనీల్ రావిపూడి కూడా అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
ఈ చిత్ర సమర్పకుడైన దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ కథ వినగానే ఈ ప్రాజెక్ట్‌లో నేనూ భాగం కావాలని అనిపించింది. అంత మంచి కథ. అందుకే నేను సమర్పకుడ్నయ్యా. గోపాలకృష్ణ చక్కగా తీశాడు. సత్యదేవ్ మంచి నటుడని రుజువు చేసే సినిమా ఇది. సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుంది అని పేర్కొన్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తన ప్రయాణంలో ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఈ సినిమాలో కూడా అన్ని మలుపులు ఉంటాయని, కథ వినగానే ఇది వందకోట్ల కంటెంట్ ఉన్న సినిమా అనిపించిందని, అదే దర్శకుడికి చెప్పానని, ఈ సినిమాకు అన్నీ బాగా కుదిరాయని, అందరికీ నచ్చుతుందని సత్యదేవ్ చెప్పారు. ఇంకా చిత్రయూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది.