అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా మనం. ఈ సినిమాలో కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి నటించి భౌతికంగా దూరమయ్యారు అక్కినేని. అందుకే మనం తెలుగు వారందరికీ ఓ చెరిగిపోని జ్ఞాపకం. ఓ మహానటుడి చివరి సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ అద్భుతం.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 23, 2014న విడుదలైంది. అంటే ఈ నెల 23కి సరిగ్గా పదేళ్లు అనమాట. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 23న మనం సినిమా ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌వారు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. నా మనసు లో మనం సినిమాది ప్రత్యేకస్థానం. పదేళ్ల వేడుక సందర్భంగా మళ్లీ ఈ చిత్రం థియేటర్లలోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు. అనూప్‌రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చిన విషయం తెలిసిందే.