తెలుగు యువకుడు గోపీచంద్ తోటకూర అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ ఎన్‌ఎస్ 25 మిషన్ ద్వారా ఆయన అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు. పశ్చిమ టెక్సాస్ నుంచి ఆరుగురు సభ్యులతో తమ ఏడో మానవ సహిత వ్యోమనౌక (న్యూ షెఫర్డ్) రోదసిలోకి వెళ్లినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. పర్యటన తర్వాత వీరు వెళ్లిన కాప్సూల్ పారాచూట్ సాయంతో తిరిగి భూమి మీదకు చేరుకుంది. భూవాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు, భూవాతావరణం నుంచి 105.7 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక వెళ్లి వచ్చింది. అక్కడ కొన్ని నిమిషాల పాటు వీరు భారరహిత స్థితిని అనుభూతి పొంది తిరిగొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గోపీచంద్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే పైలట్ శిక్షణ తీసుకున్నారు. పలు కమర్షియల్ జెట్లు, స్కైప్లేన్లు, ఎయిర్ ఆంబులెన్స్‌లకు పైలట్‌గా వ్యవహరించారు. తర్వాత ఆయన అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే వెల్‌నెస్ కేంద్రాన్ని స్థాపించారు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గోపీచంద్ చరిత్రకెక్కారు. అంతరిక్ష పర్యటన కోసం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే.