టీ20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. డల్లాస్‌లో అమెరికా , బంగ్లాదేశ్ ల మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. గ్రాండ్ ప్రైరీ ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వాతావరణం గంభీరంగా మారింది. ఆ కాసేపటికే డల్లాస్‌లో భారీ వర్షం మొదలైంది. దాంతో అక్కడి వాతావరణ కేంద్రం ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు.
బలమైన గాలుల కారణంగా మ్యాచ్ జరగాల్సిన గ్రాండ్ ప్రియరీ స్టేడియంలోని సామాగ్రి కొంత చెల్లా చెదురైంది. పిచ్, ఔట్ ఫీల్డ్ మొత్తం వాన నీటితో నిండిపోయాయి. అమెరికా, బంగ్లాదేశ్ జట్లు ఈ మధ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో సంచలన విజయం సాధించిన అమెరికా సిరీస్‌ను 2-1తో గెలిచింది.