అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాలతో ఆస్ట్రేలియాలో నిరవధికంగా ఉండిపోవడాన్ని నిరోధించేందు కు ఆ దేశ ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. దీంతో తాత్కాలిక వీసా హోల్డర్లు ఇకపై ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడం సాధ్యం కాదు. ఈ నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేవలం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేవారికే వీసాలను మంజూరు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. టెంపరరీ గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్ క్రూ వీసాల వంటి తాత్కాలిక వీసా హోల్డర్లు వచ్చే నెల ఒకటి నుంచి ఆస్ట్రేలియాలో ఉంటూ, స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి అవకాశం ఉండదు. దీని ప్రభావం ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై పడుతుంది.
ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విజిటర్ వీసా దరఖాస్తుదారులు ఆ దేశం వెలుపలి నుంచి దరఖాస్తు చేయాలి . తాత్కాలిక వీసాలు తీసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో నిరవధికంగా ఉండిపోవడాన్ని నిరోధించేందుకు ఆ దేశం ఈ చర్యలు చేపట్టింది. గత ఏడాది డిసెంబరు 11న ప్రకటించిన నూతన మైగ్రేషన్ వ్యూహంలో భాగంగా ఈ మార్పులను తీసుకొచ్చింది.