భారత్-శ్రీలంక మధ్య ప్రతిపాదిత వారధి నిర్మాణంపై శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య భూఅనుసంధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తుది దశకు వచ్చిందని తెలిపారు. గత ఏడాది జూలైలో భారత పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య బ్రిడ్జి నిర్మాణంపై ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రణిల్ విక్రమసింఘె చర్చలు జరిపారు.
ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణంపై వచ్చే వారం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ శ్రీలంక పర్యటన సందర్భంగా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. కాగా, భూ అనుసంధాన ప్రతిపాదన శ్రీలంక నుంచే వచ్చిందని గతంలో భారత ప్రభుత్వం పేర్కొన్నది. భారత్ నుంచి శ్రీలంకలోని ట్రింకోమలీ, కొలంబో పోర్టులను మధ్య వారధి ప్రతిపాదనలో ఉన్నదని వార్తలు వచ్చాయి.