ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అరుదైన కలయికతో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు వినూత్నమైన రోబోలను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. నిర్దేశించిన పనులను పూర్తిస్థాయిలో చేయగలగడంతోపాటు తినద గినవిగా ఉండటం ఈ రోబోల ప్రత్యేకత. ఈ రోబోల జీవితకాలం ముగిసిన తర్వాత వాటిని ఎంచక్కా నమిలి మింగేయవచ్చు. పోషకాహారాన్ని, మందులను పంపిణీ చేయగలగడంతోపాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించగలిగే ఈ రోబోలు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గిపోతాయి. నమ్మశక్యం కాని ఈ రోబోల ను తయారు చేసేందుకు స్విట్జర్లాండ్లోని ఇకోల్ స్పెషల్ డీ లాసాన్నే శాస్త్రవేత్తలు ఇతర యూనివర్సిటీల పరిశోధకులతో కలిసి నడుం బిగించారు.

రోబోఫుడ్ ప్రాజెక్టులో భాగంగా వీటిని తయారు చేయనున్నారు. అందుకోసం మెకానికల్ భాగాల స్థానంలో తినదగిన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని నిర్ణయించారు. రబ్బర్కు బదులుగా జెలటిన్ను, ఫోమ్ స్థానంలో రైస్ కుకీలను, తేమ నుంచి రక్షణ కోసం చాక్లెట్ లాంటి పదార్థాలను వినియోగించనున్నారు. ఇలాంటి పదార్థాల తయారీలో శాస్త్రవేత్తల పురోగతి మందకొడిగా ఉన్నప్పటికీ వారు సాధించిన విజయాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. 2017లో తినదగిన గ్రిప్పర్ను సృష్టించారు. 2022లో రైస్ కుకీ రెక్కలతో ఏకంగా ఓ డ్రోన్నే తయారు చేయగలిగారు. నిరుడు రిబోఫ్లావిన్, క్వెర్సెటిన్ను ఉపయోగించి తినదగిన బ్యాటరీని అభివృద్ధి చేయగలిగారు. కానీ, రోబోల తయారీకి అవసరమైన భాగాలను తగ్గించడం, వాటిని సూక్ష్మీకరించడం, ఆ రోబోల జీవితకాలాన్ని పొడిగించడం శాస్త్రవేత్తలకు క్లిష్టమైన సవాళ్లుగా మారాయి.
