బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్) అమల్లోకి వస్తాయి.
భారతదేశ నేర న్యాయ వ్యవస్థ, నేరాల దర్యాప్తు, విచారణ ప్రక్రియలో ఈ కొత్త చట్టాలు వేగం తీసుకురానున్నా యని, ఒక ఆధునిక న్యాయ వ్యవస్థను అందించనున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త చట్టాల్లో జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎంఎస్‌ఎం వంటి ఎలక్ట్రానిక్ మోడ్ విధానంలో సమన్లు జారీ, అతి క్రూరమైన నేరాల క్రైమ్ సీన్‌లను వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా కాకుండా కొత్త చట్టాలు ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గతంలో చెప్పారు.