బ్రిటన్ రాజధాని లండన్‌లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొదటి సారిగా తెలంగాణ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్‌లోని భారత్ భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రవాసులకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాసుల్లో ఐక్యత, విదేశీ గడ్డపై భారత సంస్కృతిని ప్రచారం చేయడానికి వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకల్ని భారత హైకమిషన్ అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడమేకాకుండా అతిథులకు బిర్యానీతో అసలైన తెలంగాణ సంప్రదాయాన్ని చూపించారని తెలిపారు.
లండన్‌లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న తెలంగాణ డే వేడుకల్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అన్నారు. టాక్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు అనిల్ కూర్మాచలం నాయకత్వంలో భారత హైకమిషన్ ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశామన్నారు. భారత హైకమిషన్ కార్యాలయంలో అధికారికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసిన భారత హైకమిషన్ కార్యాలయ అధికారులకు, హాజరై సహకరించిన టాక్ సభ్యులకు తెలిపారు. స్వాతి, సుప్రజ, స్నేహ, కుమారి తన్మయ, విద్య చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో టాక్ ప్రతినిధులు నవీన్ రెడ్డి, హరి నవాపేట్, పవిత్ర, సురేష్ బుడగం, రావుల పృథ్వీ, కార్తీక్, నిఖిల్, కార్తీక్, నవ్య జ్యోతి, దివ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.