హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు నస్రల్లా వారసుడిని లక్ష్యంగా చేసుకున్నది. లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. హెజ్బొల్లా సీనియర్ నేత హషేమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తున్నది. నస్రల్లా మరణం తర్వాత హెజ్బొల్లాకు సఫీద్దీన్ నాయకత్వం వహించనున్నట్టు భావిస్తున్నారు. కాగా, హెజ్బొల్లా కమ్యూనికేషన్ విభాగం కమాండర్ మహమ్మద్ రషీద్ సకాఫిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. లెబనాన్‌పై తాము జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందారని చెప్పింది.
హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ పేర్కొన్నారు. హెజ్బొల్లాకు ఒకదాని తర్వాత ఒకటి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మేము నస్రల్లాను హతమార్చాం. మా ఆయుధాగారంలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు జరగనున్నాయి. కొన్ని ఇప్పటికే చేపట్టాం, ఇంకొన్ని చేపట్టాల్సి ఉంది అని గలాంట్ అన్నారు.