అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో కాబోయే ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఓ ఆనవాయితీని పక్కన పెట్టినట్లు తెలిసింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అనంతరం శాంతియుతంగా అధికార మార్పిడికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న బైడెన్ ఈ నెల 13న ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ఫస్ట్‌లేడీ జిల్ బైడెన్ కాబోయే ప్రథమ మహిళకు టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పార్టీకి సంబంధించిన ఆహ్వానాన్ని మెలానియా ట్రంప్‌కు వారం క్రితమే పంపారు. అయితే, ఈ పార్టీకి కాబోయే ఫస్ట్‌లేడీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, అధికార బదిలీ సందర్భంగా సంప్రదాయానికి బ్రేక్ పడటం ఇదేమీ మొదటిసారి కాదు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన విషయం తెలిసిందే. అప్పుడు ఫస్ట్ లేడీగా ఉన్న మిచెల్ ఒబామా, మెలానియా కు టీ పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత 2020 ఎన్నికల ఫలితాల్లో బైడెన్ గెలుపొందారు. అప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌తో ట్రంప్ భేటీ కావాల్సి ఉండగా, అది జరగలేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. అప్పుడు కూడా ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అవడం గమనార్హం.