ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. శుక్రవారం ఫస్ట్‌గ్లింప్స్‌ను అగ్ర హీరో మహేష్‌బాబు విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ను మురికివాడలో జీవితం గడుపుతున్న నిజాయి తీపరుడైన వ్యక్తిగా పరిచేయం చేశారు. మరోవైపు అందుకు పూర్తి భిన్నంగా ముంబయిలో కుటుంబం తో కలిసి వుంటున్న రిచెస్ట్ బిజినెస్‌మ్యాన్‌గా నాగార్జున పాత్రను చూపించారు.
ఇక రష్మిక మందన్న సంఘర్షణలతో సతమతమవుతున్న మధ్యతరగతి యువతిగా కనిపించింది. ఈ మూడు పాత్రల్లోని భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. అసలు వీరిమధ్య సంబంధం ఏమిటన్న ది ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఉంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. సమకాలీన సమాజంలోని ఆర్థిక అసమానతలు, వాటి తాలూకు పర్యవసానాలను చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల సహజశైలికి భిన్నంగా సొసైటీలోని సీరియస్ ఇష్యూని ఇతివృత్తంగా ఎంచుకొని ఈ సినిమా తీసినట్లుగా అర్థమవుతున్నది.