కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించా రు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక, ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు, ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజీకాయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానా నికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నిక ల్లో ఇదే స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన (3.64 లక్షలు) మెజార్టీని ఆమె అధిగమించారు.