ఇటీవలే తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీనిచ్చింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. చిరకాల స్నేహితుడు ఆంటోనితో ప్రేమలో ఉన్నానని, ఇక జీవితాంతం తమ బంధం కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో ఈ భామ పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్నదని అభిమానులు భావించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్ అక్కడే తన పెళ్లి వివరాలను తెలియజేసింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది. తన తాజా హిందీ చిత్రం బేబీ జా న్ త్వరలో విడుదలకానుందని, అందుకే స్వామివారిని దర్శించుకున్నానని కీర్తి సురేష్ పేర్కొంది. దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేష్ బేబీ జాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నది. వరుణ్‌ధావన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.