అమెరికాలోని పలు యూనివర్సిటీలకు ట్రంప్ భయం పట్టుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో అవి ముందుగానే అప్రమత్తమయ్యాయి. గతంలో ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల ప్రయాణాలపై ఆంక్షలు విధించిన క్రమంలో ముందే జాగ్రత్త పడుతున్నాయి. విద్యార్థులు జనవరి 20కి ముందే అమెరికాకు వచ్చి విద్యాసంస్థల్లో చేరాలని భారత్ సహా పలు దేశాల్లోని విద్యార్థులకు ప్రయాణ సూచనలు జారీ చేస్తున్నాయి.
ముఖ్యంగా మాసాచుపెట్స్, అమ్హోర్ట్స్ సహా పలు ప్రముఖ వర్సిటీల విదేశీ విద్యార్థులు, సిబ్బందిని జనవరి 20లోగా తమ దేశానికి వచ్చేయాలని కోరాయి. యూనివర్సిటీలకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అఫెయిర్స్ కూడా ఇదే తరహా అడ్వయిజరీ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ మొదటి రోజే ఇమ్మిగ్రేషన్, ఆర్థిక పాలసీలను లక్ష్యంగా చేసుకుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.