అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి మాట్లాడింది. గోవాలో పెళ్లి జరుగుతుందని, త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పింది. తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తాలూకు వెడ్డింగ్ కార్డ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆహ్వాన పత్రికలో ఈ నెల 12న గోవాలో పెళ్లి జరగనున్నట్లు రాసి ఉంది.
అయితే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను కీర్తి సురేష్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని ప్రకటిస్తారని తెలిసింది. ఇక కీర్తి సురేష్‌ను పెళ్లాడబోతున్న ఆంటోని ఆమె కాలేజీ స్నేహితుడు. దాదాపు 15 ఏండ్లుగా వీరిమధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి. ఇద్దరి కుటుంబాలు కూడా సన్నిహితంగా ఉంటాయని తెలిసింది. ఆంటోని కేరళలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాల్లో నటిస్తున్నది.