నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పాన్ ఇండియా స్థాయి ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ముంబయి లో హిందీ ట్రైలర్ను అగ్ర నటుడు అమీర్ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ట్రైలర్ అద్భుతంగా ఉందని, హృదయాన్ని తాకే భావోద్వేగాలున్నాయని ప్రశంసించారు. చైతన్య అద్భుతమైన నటుడని, లాల్సింగ్ చద్దా లో సినిమాలో తనతో కలిసి నటించినప్పుడు అతని సహృదయత ఎంతగానో ఆకట్టుకుందని అమీర్ఖాన్ పేర్కొన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ ఇదొక అందమైన ప్రేమకథ. అరవింద్గారు నిర్మాత తీసిన 100 పర్సెంట్ లవ్ చిత్రం నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఇప్పుడు తండేల్ కూడా నా కెరీర్లో మరో మైలురాయి అవుతుందనే నమ్మకం ఉంది. ఇలాంటి కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, ఏడాదిన్నర పాటు నిరంతరం ఈ సినిమా కోసం కష్టపడ్డారని చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ పేర్కొన్నారు. కథానాయకుడు రాజు పాకిస్థాన్ కరాచీలో తన మనుషుల కోసం ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చందూ మొండేటి తెలిపారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు.