అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీచేశారు. టారిఫ్ వార్ షురూ చేశారు. ఒకే సారి మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
మెక్సికో, కెనడా దిగుమతులపై 25 శాతం (కెనడియన్ ఎనర్జీపై 10 శాతం), చైనాపై 10 శాతం అదనపు సుంకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా ఈ సుంకాలు విధించానని తెలిపారు. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉన్నదని, అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని వెల్లడించారు. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని తెలిపారు.