
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరో టారిఫ్ బాంబు పేల్చారు. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న విద్యుత్తు శక్తిపై ఒంటారియో(కెనడా ప్రావిన్స్) పరస్పర సుంకాలు విధించటం ట్రంప్ సర్కార్‌ను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో కెనడా నుంచి దిగుమతి అవుతున్న అన్ని రకాల స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల్ని 25 నుంచి 50శాతానికి పెంచుతూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళ్తున్నాయి. కెనడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రో పవర్, సహజవాయువు, ఎలక్ట్రిసిటీ పై అమెరికా ఆధారపడి ఉంది. కెనడా లోని ఒంటారియో ప్రీమియర్ డగ్‌ఫోర్డ్ ఇటీవల అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా తమపై సుంకాల విధింపును అమలు చేస్తున్న నేపథ్యంలో తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పారు.
