
యూరోపియన్ యూనియన్ (ఈయూ) వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకం ఫలితంగా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా, యూరోపియన్ యూనియన్ ప్రకటించాయి. దీనిపై ట్రంప్ మరోసారి స్పందించారు. అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించిన పక్షంలో తాము మళ్లీ అదనంగా జరిమానా విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. వారు తమ నుంచి ఎంత వసూలు చేస్తారో తామూ అంతే వసూలు చేస్తామని స్పష్టంచేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధికారులతో తాము చర్చలను పునరుద్ధరిస్తామని యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ప్రకటించారు. అటువంటి సుంకాలతో తమ ఆర్థిక వ్యవస్థలపై భారం వేయలేమని చైర్మన్ తెలిపారు.
