
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలోచన సరైనదేనని, తాము కచ్చితంగా మద్దతిస్తామని చెప్పారు. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై అమెరికాతోనూ, ఇతర భాగస్వాములతోనూ చర్చించవలసి ఉందని తెలిపారు.

ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని నియంత్రించే యంత్రాంగం ఉండాలన్నారు. కాల్పుల విరమణ పాటించే 30 రోజులను ఉక్రెయిన్ తన సైన్యాల మోహరింపు, ఆయుధాల సేకరణల కోసం ఉపయోగించుకుంటుందా అనేది ఓ సమస్య అన్నారు. కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారి తీయాలన్నారు. సంక్షోభానికి మూల కారణాలను నిర్మూలించాలని చెప్పారు.

ఉక్రెయిన్‌కు అమెరికా నచ్చజెప్పినట్లు కనిపిస్తున్నప్పటికీ, యుద్ధ క్షేత్రంలో పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ ఆసక్తి చూపుతున్నదన్నారు. రష్యాలోని కుర్‌స్క్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన ఉక్రెయిన్ సేనలను రానున్న రోజుల్లో దిగ్బంధిస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కనీసం 30 రోజుల కాల్పుల విరమణ ఉక్రెయిన్‌కు శ్రేయస్కరమని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
