
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీఆర్‌ఎస్ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి అనని మాటను అన్నట్లు చెబుతూ సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్ధాలపై జగదీశ్ రెడ్డి ప్రశ్నించారన్నారు.

రైతు రుణమాఫీ, రైతుభరోసా, వృద్ధులకు, వికలాంగులు పింఛన్, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నిలుపుకోవడం లేదని జగదీశ్ రెడ్డి ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.తక్షణమే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఎన్నారైలంతా బాధ పడుతున్నారన్నారు. తామంతా జగదీశ్ రెడ్డి వెంటే ఉన్నామని తెలియజేశారు.
