
నాని సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం కోర్ట్- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. దీప్తి గంటా సహ నిర్మాత. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో నాని మాట్లాడారు. నేను ఈ రోజుదాకా స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీమ్‌ని గెలిపించింది. ప్రేక్షకులు సినిమాను గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో నేను గర్వంగా ఫీలవుతున్నాను. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది. ఈ సినిమా విజయానికి కారకులైన అందరికీ పేరుపేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అని హీరో నాని అన్నారు.

బలగం తర్వాత తనకు దొరికిన గొప్ప అవకాశం కోర్ట్ సినిమా అని హీరో ప్రియదర్శి అన్నారు. పాతికేళ్లుగా మంగపతి లాంటి పాత్రకోసం ఎదురుచూస్తున్నానని, నాని తెలుగు సినిమాకు మరో సూపర్‌స్టార్ కృష్ణ అని నటుడు శివాజీ కొనియాడారు. నాని ప్రొడక్ట్‌ని అని చెప్పుకోడానికి ఒక దర్శకునిగా గర్విస్తానని దర్శకుడు రామ్‌జగదీష్ అన్నారు. ఇంకా నటులు శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్, రోషన్, నటి శ్రీదేవి, సహ నిర్మాత దీప్తి గంట, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తదితరులు మాట్లాడారు.
