
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని తరచూ బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గ్రీన్‌లాండ్‌వాసులు కన్నెర్ర చేశారు. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా గ్రీన్‌లాండ్ పౌరులు, అధికార, విపక్ష నేతలు ఒక్కటయ్యారు. గ్రీన్‌లాండ్ రాజధాని నూక్‌లో యూఎస్ దౌత్య కారాల్యయం ఎదురుగా వందలాది మంది ప్లకార్డులు, జెండాలు పట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు. త్వరలో ప్రధాని పదవి నుంచి దిగిపోనున్న మ్యూట్ బీ ఇగెడి నిరసన ర్యాలీకి నేతృత్వం వహించగా, ఎన్నికల్లో గెలుపొందిన డెమొక్రటిక్ పార్టీ నాయకుడు జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ర్యాలీలో పాల్గొనటం గమనార్హం. వీ ఆర్ నాట్ ఫర్ సేల్, మేక్ అమెరికా గో అవే, అనే సందేశాల్ని నిరసనకారులు జెండాలపై ప్రదర్శించారు. గ్రీన్‌లాండ్‌లోని ఇతర నగరాల్లోనూ ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు కొనసాగాయి. దీనికంటే ముందు శుక్రవారం ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ గ్రీన్‌లాండ్ పార్లమెంట్‌లోని ఐదు రాజకీయ పార్టీలు సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశాయి.
