అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపేటపుడు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో భారత్ చాలా తెలివిగా, జాగ్రత్తగా ఆలోచించి, వ్యవహరించాల్సి వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ శుక్రవారం హెచ్చరించారు. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 6-7శాతం మధ్య స్థిరపడిందని, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న కారణంగా చాలా స్వల్పమైన శాతంలో ప్రభావితమై వుండొచ్చునని రాజన్ పేర్కొన్నారు.

సాధారణంగా వ్యవసాయ రంగానికి సంపన్న దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తూ వుంటాయి. దాదాపు ప్రతి దేశం తన రైతాంగానికి ఎంతో కొంత సబ్సిడీ ఇస్తూ వుంటుంది. వారితో పోలిస్తే మన రైతులు చాలా స్వల్ప మొత్తాల్లోనే రాయితీలను పొందవచ్చు, లేదా వారికన్నా తక్కువ కూడా వుండొచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా బయట నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వెల్లువ దేశంలోకి వచ్చిపడితే మన రైతాంగానికి అనేక సమస్యలు తలెత్తవచ్చని అన్నారు.
















