ప్రపంచంలోని 12 మేటి జట్ల మధ్య నేటి మహా సంగ్రామం మొదలు కానుంది. ఐదేండ్ల తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర దశకు నేడు తెరలేవనుంది. ప్రపంచకప్ సమరంలో బోరింగ్ మ్యాచ్‌లకు తావివ్వకుండా ర్యాకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లను నేరుగా వరల్డ్ కప్‌నకు ఎంపిక చేసిన ఐసీసీ మరో నాలుగు జట్ల కోసం గ్రూప్ మ్యాచ్‌లను నిర్వహించింది. వాటిలో ప్రతిభ కనబర్చిన జట్లు సూపర్ 12కు అర్హత సాధించగా నేటి నుంచి మెగాలీగ్‌లో కీలక ఘట్టానికి తెరలేవనుంది. మొత్తం 45 మ్యాచ్‌ల్లో ఇప్పటికే 12 మ్యాచ్‌లు ముగియగా మరో 33 మ్యాచ్‌ల్లో విశ్వ విజేత ఎవరనేది తేలిపోనుంది.
సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్నా..కరోనా కారణంగా యూఏఈ వేదికగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నది. నేడు రెండు మ్యాచ్‌లు జరుగనుండగా గ్రూప్ 1 తొలి పోరులో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడుతుంది. వన్డే ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన ఆసీస్ టీ20ల్లో ఇప్పటి వరకు టైటిల్ పట్టలేకపోగా ఐసీసీ టోర్నీల్లో దురదృస్టాన్ని వెంట పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా ఈసారైనా ఆ ముద్ర చెరిపేసుకోవాలని చూస్తున్నది. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో డిఫెండిరగ్ చాంపియన్ వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనుంది. స్పిన్నర్లకు స్వర్గధామంలా కనిపిస్తున్న పిచ్‌పై మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ సత్తా చాటుతారో లేక విండీస్ హిట్టర్లు దంచికొట్టి మెగాటోర్నీలో బోణీ కొడతారో చూడాలి.