హుజూరాబాద్ ఎన్నికల్లో నియంతృత్వం నెగ్గుతుందా, ప్రజాస్వామ్యం గెలుస్తుందా అని దేశమంతా ఎదురు చూస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకరవ్గంలో జరిగిన రోడ్ షోలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ సభను తామెవరమూ అడ్డుకోలేదని అన్నారు. కేంద్రమంత్రి అయిన తాను కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు కేవలం రోడ్ షోలే నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నిజాయితీపరుడని, కేసీఆర్ చేస్తున్న తప్పులను ప్రశ్నించినందుకే ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలని చూశారని ఆరోపించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే రాజేందర్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కేంద్రమే మొత్తం నిధులను సమకూరుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు.