దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రెండు దేశాల్లో దేనిపైన అయినా దాడి జరిగితే అది ఇద్దరిపైనా జరిగిన దాడిగా భావిస్తారు. అప్పుడు రెండు దేశాలూ దాడి చేసిన దేశంపై పోరాడేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఒప్పందంపై భారత్ తాజాగా స్పందించింది. ఈ ఒప్పందం పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
















