నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. మురళీ మనోహర్ దర్శకుడు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించాడు. యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది అని అన్నారు.

కొత్త నిర్మాతలు తీసిన ఇలాంటి చిత్రాల్ని ఆదరిస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మన నేటివిటీ పరిధిలోనే తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాను చూపించే ప్రయత్నం చేశామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో తాను సౌధామినిగా విభిన్న పాత్రలో కనిపిస్తానని కథానాయిక ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఇందులో తాను నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తానని హీరో నరేష్ అగస్త్య పేర్కొన్నారు. తెలుగులో ఇప్పటివరకూ రాని డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదని, గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్‌కు రాబోతోంది.















