అమెరికా వీసా సంక్షోభం మరింత అధ్వానంగా మారింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా పడడంతో వందలాది భారతీయుల అమెరికా ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. అమెరికాలో తమ కుటుంబాలను వదిలి భారత్‌కు వచ్చిన వేలాది మంది భారతీయులు దాదాపు మరో ఏడాదిపాటు తమ ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీ పేరిట హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చికి తొలుత వాయిదా వేసిన భారత్‌లోని అమెరికన్ ఎంబసీలు ఇప్పుడు వచ్చే అక్టోబర్ వరకు వాయిదాను పొడిగించాయి.

హెచ్-1బీ, హెచ్-4 వీసా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న వందలాది భారతీయ దరఖాస్తుదారులు తమ అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబర్‌కు వాయిదా పడడంతో అనిశ్చితిలో చిక్కుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదాపడిన కేసులు తమ దృష్టికి వచ్చినట్లు అమెరికన్ ఇమిగ్రేషన్ న్యాయవాదులు అమెరికన్ బజార్‌కు తెలియచేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీ విస్తరణ కారణంగా మరింత సమయం పట్టే అవకాశం ఉందని, అందుకే వీసా ఇంటర్వ్యూలను అక్టోబర్ వరకు వాయిదా వేయడం జరిగిందని అమెరికన్ కాన్సులేట్స్ తెలిపాయి.















