
వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది. అమెరికా వ్యతిరేకులే కాకుండా మిత్ర దేశాలు కూడా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిం చాయి. అన్ని వైపుల నుంచి విమర్శ నాస్త్రాలు తగలడంతో అగ్రరాజ్యం ఉక్కిరి బిక్కిరైంది. అదే సమయంలో వెనిజులాపై జరిపిన దాడిని నిస్సిగ్గుగా సమర్ధించుకుంది. వెనిజులా పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా వ్యవహారాలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడాన్ని పలు దేశాలు నిరసించాయి. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయన్న ఆరోపణతో కొలంబియా, మెక్సికోపై కూడా సైనిక చర్యకు దిగుతామంటూ ట్రంప్ ఇటీవల చేస్తున్న ప్రకటనలను గర్హించాయి. అమెరికా భద్రతా ప్రయోజనాల కోసం డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.















