
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం మినియాపాలిస్‌లో 37 ఏండ్ల వలస మహిళను ఇమిగ్రేషన్ ఏజెంట్ ఒకరు కాల్చి చంపడంపై ఆ నగరంలో ప్రజాగ్రహం పెల్లుబికింది. శనివారం ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా 10 వేల మందికి పైగా నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. రెనీ నికోలో గుడ్ అనే మహిళ కారులో వస్తుండగా, ఇంటికి సమీపంలో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఏజెంట్ ఒకరు ఆమెను కాల్చి చంపడంపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐసీఈ వెళ్లిపోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు జరిగాయి. ఈ నెల 7న రెనీ హత్యకు గురైన ప్రాంతానికి స్వదేశీ నృత్యకారుల నేతృత్వంలో నిరసనకారులు నగరం గుండా భారీ ప్రదర్శనగా తరలి వెళ్లారు.















