అమెరికాలోని హ్యూస్టన్‌లో ఈనెల 5న జరిగిన ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఘటన రోజునే 8 మంది మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన భారత సంతతి యువతి భారతి సహాని (22) ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కన్నుమూసింది. తొక్కిసలాటలో ఆమె మెదడుకు తీవ్ర గాయమైందని కటుంబ సభ్యులు తెలిపారు. తొలిసారి తన అభిమాన గాయకుడి ప్రదర్శన చూసేందుకు వెళ్లిందని భారతి తండ్రి సన్నీ వాపోయారు. ర్యాపర్ స్టార్ స్కాట్ ట్రావిస్ ప్రదర్శనను దగ్గరినుంచి చూసేందుకు వేలమంది యువతీ యువకులు వేదిక వైపు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.
భారతీ సహాని భారతీయ సంతతికి చెందిన మొదటి తరం అమెరికన్. టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుతున్న ఆమె త్వరలో పట్టభద్రురాలు కానున్నది. ఈ నేపథ్యంలో తమ విద్యార్థిని భారతి మరణం పట్ల ఆ యూనివర్సిటీ అధికారులు ఆమె కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన 9 మంది, 14 నుంచి 27 ఏండ్ల వయసు వారేనని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 ఏండ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడిరచారు.