భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీయులను ఆహ్వానిస్తోంది. 99 దేశాల నుంచి వచ్చే వారికి ఎలాంటి క్వారంటైన్ నిబంధనలు వర్తింపజేయబోమని ప్రకటించింది. దీంతో అమెరికన్లు కూడా భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) తమ పౌరులకు కోవిడ్ నిబంధనలను సూచించింది. ఈ మేరకు లెవన్ వన్ కరోనా నిబంధనలు జారీ చేసింది. టీకా పూర్తి డోసులు తీసుకున్నవారికి వైరస్ సంక్రమించే ప్రమాదం, తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ఉండొచ్చని పేర్కొంది. భారత్ వెళ్లే ముందు టీకా డోసులు పూర్తయ్యాయో, లేదో చూసుకోవాల్సిందిగా సూచించింది. కచ్చితంగా మాస్క్ ధరించాలని, అక్కడ కూడా సామాజిక దూరం పాటించాలని నోటీసులో పేర్కొంది.
భారత్‌లో ఉగ్రవాదం, మతపరమైన హింస వంటి వాటి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నేరాలు, ఉగ్రవాదం, కరోనా వంటి అంశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లొదని తెలిపింది. పర్యాటక, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.