ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులను సమన్వయం చేసుకుంటూ పర్యాటకానికి పెద్ద పీట వేయనున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. విశాఖలో రూ.వంద కోట్లతో చేపట్టే క్రూయిజ్ టెర్మినల్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. విశాఖపట్నం వచ్చిన ఆయన స్వదేశీ దర్శన్ పథకం కింద పనులు చేపట్టిన బావికొండ బౌద్ధ స్తూపాలను పరిశీలించారు. పర్యాటక శాఖ, రైల్వే, పోర్టు అధికారులతో పర్యాటక అభివృద్ధిపై విశాఖలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీకి నాలుగు పర్యాటక సర్క్యూట్లను మంజురు చేయగా వాటిలో రెండు పూర్తయ్యాయి. ప్రసాద్ పథకానికి ఎంపికైన సింహాచలం, అన్నవరం పుణ్యక్షేత్రాల వద్ద మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇస్తున్నాం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా లేపాక్షి ఎంపికయ్యేందుకు కృషి చేస్తామని అన్నారు.
వచ్చే ఏడాది అల్లూరి సీతారామరాజు 152వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. చింతపల్లిలో అల్లూరి సీతారామరాజు ట్రిబ్యునల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడిరచారు. అరకుకు పూర్తిగా అద్దాల (విస్టాడమ్) బోగీలతో నడిచే ప్రత్యేక రైలు నడపడంపై రైల్వేశాఖ అధికారులతో చర్చిస్తానన్నారు.