ఆన్‌లైన్‌లో ఏదైనా సర్వీస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి! మీ చిన్న అజాగ్రత్త సైబర్ కేటుగాళ్లకు కాసుల వర్షం కురిపించవచ్చు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి గోగినేని అనితా చౌదరి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని భారీగా నగదు పోగొట్టుకున్నారు. విమాన టికెట్ల బుకింగ్ పేరుతో కేటుగాళ్లు ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ. 4.14 లక్షలు కొల్లగొట్టారు.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరుకావాలని అనితా చౌదరి ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం రానుపోను బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న ట్రావెల్ ఏజెన్సీల వివరాల కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, ‘లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ అనే సంస్థ పేరు కనిపించింది.

వెంటనే ఆ సంస్థకు చెందిన రాజేష్ అనే ఏజెంట్‌ను ఆమె ఫోన్‌లో సంప్రదించారు. టికెట్ల ధర రూ. 4,14,180 అవుతుందని చెప్పిన నిందితుడు, బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి డెబిట్ కార్డ్ వివరాలు అవసరమని నమ్మించాడు. నిందితుడు పంపిన ఒక ‘వ్యూ ఫామ్’ లింక్‌లో అనిత తన కార్డు వివరాలను నమోదు చేశారు. ఆ సమయంలో ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఉండేలా ఫోన్‌లో మాటలతో బిజీగా ఉంచిన రాజేష్, మొబైల్‌కు వచ్చిన ఓటీపీలను చెప్పాలని కోరాడు.

నిజంగానే టికెట్లు బుక్ అవుతున్నాయని భావించిన అనిత, తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీలను చెప్పేశారు. క్షణాల్లోనే క్లియర్‌ట్రిప్ ద్వారా ఆమె ఖాతా నుంచి రూ. 4,14,180 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. డబ్బులు కట్ అయినా, విమాన టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ మెసేజ్ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన నటి, వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన మోసంపై ఫిర్యాదు అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.















