కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. అర్హులైన కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇకపై రూ. 1.8 లక్షల వరకు విలువైన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్‌లు, ఇతర గ్యాడ్జెట్‌లను పొందవచ్చు. ఈ బడ్జెట్‌లో ఖరీదైన ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను కూడా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. అంతేకాదు, నాలుగేళ్ల పాటు వాడిన తర్వాత ఆ డివైజ్‌లను ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా శాశ్వతంగా తమ సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ రూ.1.8 లక్షల పరిమితి వర్తించాలంటే ఆ డివైజ్‌లో 40 శాతానికి పైగా మేక్ ఇన్ ఇండియా కంటెంట్ ఉండాలనే షరతు విధించారు. మిగిలిన ఇతర డివైజ్‌లకు గరిష్ట పరిమితిని రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. జూలై 2023లో ఉన్న రూ.1 లక్ష , రూ. 1.3 లక్షల పరిమితులను సవరిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త పాలసీ కింద ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్‌లు, నోట్‌ప్యాడ్‌లు, అల్ట్రాబుక్‌లు, నోట్‌బుక్‌లు అందించనుండగా, గత మార్గదర్శకాలలో ఉన్న మొబైల్ ఫోన్లను ఈసారి జాబితా నుంచి తొలగించారు. ఈ సౌకర్యం అందరికీ కాకుండా పే లెవెల్ 12, ఆపై స్థాయి అధికారులకు 100 శాతం వర్తిస్తుంది. అలాగే పే లెవెల్ 8 నుంచి 11 వరకు ఉన్న ఉద్యోగులలో 50 శాతం మందికి అర్హత కల్పించగా, కార్యాలయ అవసరాల దృష్ట్యా ఆర్థిక సలహాదారుతో సంప్రదించి దీనిని 75 శాతం వరకు పెంచుకునే అధికారాన్ని ఆయా శాఖల కార్యదర్శులకు ఇచ్చారు.

నాలుగేళ్ల తర్వాత అధికారులు ఆ డివైజ్‌లను ఉంచుకోవాలనుకుంటే, వాటిలోని అధికారిక సమాచారాన్ని పూర్తిగా తొలగించిన తర్వాతే అప్పగిస్తారు. ఒకవేళ నాలుగేళ్ల లోపే రిటైర్ అయినా లేదా ఉద్యోగం మానేసినా, ఏడాదికి 25 శాతం తరుగుదల లెక్కగట్టి మిగిలిన విలువను చెల్లించడం ద్వారా ఆ డివైజ్‌లను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అనుబంధ కార్యాలయాలకు మాత్రమే వర్తించే ఈ నిబంధనల ప్రకారం, డివైజ్ పూర్తిగా రిపేర్‌కు పనికిరాదని తేలితే తప్ప నాలుగేళ్ల లోపు మరో కొత్త డివైజ్ మంజూరు చేయరు.















