బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో మద్దతుదారులు పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలైన అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ భవనాలలోకి చొరబడ్డారు. సెక్యూరిటీ వలయాలను ఛేదించి, బారికేడ్లను తొలగించిన ఆందోళనకారులు పెద్దయెత్తున ఈ భవనాల్లోకి ప్రవేశించారు. భవనాల పైకప్పుల పైకి సైతం ఎక్కిన ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. కిటికీలు, తలుపులతో పాటు లోపల ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే తన ఓటమిని ఆయన ఒప్పుకోక ఎన్నికల విధానాన్ని, సుప్రీంకోర్టును విమర్శిస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన మద్దతుదారులు రోడ్లను దిగ్బంధించడం, వాహనాల దహనం, మిలటరీ కార్యాలయాల ముందు పెద్దయెత్తున గుమిగూడటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఒక్కసారిగా వేలమందితో బ్రెజిల్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా ప్రమాణస్వీకారం చేసిన వారం తర్వాత ఈ విధ్వంసకర సంఘటన చోటుచేసుకుంది.