అమెరికాలో ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలన్న ప్రతిపాదనను బైడెన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో పాటు 2023 నాటికల్లా గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్ లేవీ లేకుండా చేయాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత్, చైనాల నుంచి అమెరికా వెళ్లిన అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో వారి భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది. వలస విధానాల వ్యవహారాలను పర్యవేక్షించే ప్రెసిడెన్షియల్ అడ్వైసరీ కమిషన్ ఈ ఏడాది మేలో గ్రీన్ కార్డుకు సంబంధించి పలు ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. శ్వేతసౌధంలోని డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ పరిశీలనకు పంపింది. వీటిని సమీక్షించిన అనంతరం కౌన్సిల్ ఈ నివేదికను అధ్యక్షుడి ముందుంచుతుంది. ఈ ప్రతిపాదనలను జో బైడెన్ ఆమోదిస్తే భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.