పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బునేర్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం నుంచి ఓ మహిళ పోటీలో నిలిచారు. ఆమె ఒక హిందూ. పీకే-25 జనరల్ సీటుకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున అభ్యర్థిగా డాక్టర్ సవీరా ప్రకాశ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జనరల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న తొలి మహిళగా రికార్డుల్లో నిలిచారు. 35 ఏండ్ల డాక్టర్ సవీరా ప్రకాశ్ అబోట్టాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. అమె తండ్రి ఓమ్ ప్రకాశ్ కూడా డాక్టర్ కావడం విశేషం.
తన గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్న ఆమె ఈ ప్రాంతంలో మహిళా సాధికారత, భద్రత, మహిళ హక్కుల కోసం ఆమె తన గళాన్ని వినిపిస్తున్నారు. అభివృద్ధిలో మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని, అణచివేతకు గురిచేస్తున్నారని వెల్లడించారు. పాకిస్థాన్‌లో 16వ నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు 2024, ఫిబ్రవరి 8 జరగనున్నాయి.