
అమెరికా నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాంతీయ విమానాశ్రయంలో బిజినెస్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానాశ్రయాన్ని నాస్కార్ బృందాలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలు వినియోగిస్తున్నాయి. ప్రమాదం తర్వాత విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సెస్నా సీ550 విమానం షార్లెట్‌కు ఉత్తరాన 45 మైళ్ల దూరంలో ఉన్న స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఏడుగురు ఉన్నట్లుగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ధ్రువీకరించింది. ప్రమాదంలో నాస్కార్ రిటైర్డ్ డ్రైవర్ గ్రెగ్ బిఫెల్‌తో పాటు ఆయన కుటుంబీకులు ఉన్నట్లుగా భావిస్తున్నట్లు నార్త్ కరోలినా హైవే పెట్రోల్ పేర్కొంది. ప్రమాదం తర్వాత భారీగా మంటలు చెలరేగడంతో గుర్తింపు సాధ్యం కాలేదన్నారు. బాధితుల గుర్తింపు కోసం వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు స్టేట్స్‌విల్లే సిటీ మేనేజర్ రాన్ స్మిత్ పేర్కొన్నారు.















