అంతర్జాతీయ విద్యార్థులు, కార్మికుల వలసలు రికార్డు స్థాయికి చేరుకోవటంతో ఆస్ట్రేలియా నియంత్రణ చర్యలకు దిగింది. స్టూడెంట్ వీసా నిబంధనల్ని కఠినతరం చేయబోతున్నది. మారిన నిబంధనల్ని అమల్లో తీసుకొచ్చేందుకు ఆస్ట్రేలియా చర్యలు చేపట్టింది. ఆ దేశ హోం మంత్రి క్లారి ఓ నీల్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో రెంటల్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని, దీంతో స్టూడెంట్ వీసా నిబంధనల్ని కఠినతరం చేసేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసే ఉద్దేశంతో వస్తున్న అంతర్జాతీయ విద్యార్థులను అడ్డుకునేందుకు ‘జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్’ను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. విజిటర్స్ వీసాలపై వచ్చే వారికి షరతులు విధించనున్నామని అన్నారు. ఆ దేశానికి ఏటా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధిక మంది ఇండియా, చైనా, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందినవారే ఉన్నారు.