ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. మక్కా సందర్శించడానికి ప్రతి ఏటా కోట్లమంది జనాలు తరలి వస్తారు. హజ్ యాత్రకు వచ్చేవారి వయోపరిమితిని కూడా తొలగించారు. ఈ నిర్ణయంతో ఎంత మంది యాత్రికులైనా ఇప్పుడు హజ్‌ను దర్శించుకోవచ్చు. అలాగే, ఏ వయస్సు వారైనా హజ్ యాత్రకు వెళ్లగలుగుతారు. జైరియన్ల సరిహద్దు నుంచి కూడా ఆంక్షలు ఎత్తివేశారు. కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా సౌదీ అరేబియా హజ్ యాత్రపై ఈ ఆంక్షలను విధించింది. సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా ఈ విషయాలను వెల్లడించారు. హజ్ యాత్ర జూన్ 26 నుంచి ప్రారంభమవనున్నది.
హజ్ యాత్ర దరఖాస్తులను ఫిబ్రవరి 15 వరకు దాఖలు చేయవచ్చు. దీని కోసం ప్రయాణికులు జూలై మధ్య వరకు చెల్లుబాటయ్యే నివాస గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. దాంతో పాటు కరోనా, సీజనల్ ఇన్‌ఫ్లూయోంజా టీకా తీసుకున్నట్లు సర్టిఫికేట్ కలిగి ఉండాలి. హజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా కూడా డైరెక్ట్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులకు ఒకే మొబైల్ నంబర్‌ను వినియోగించకుండా చూడాలని అధికారులు సూచిస్తున్నారు.