అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య కీలక సమావేశం జరుగనుంది. ఈ నెల చివర్లో శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు సందర్భంగానే జో బైడెన్, జీ జిన్‌పింగ్ భేటీ కానున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ మీడియా కార్యదర్శి జీన్ పెర్రీ వెల్లడించారు. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ పోరు నేపథ్యంలో బైడెన్, జిన్‌పింగ్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే వీరి భేటీలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అంశం చర్చకు వస్తుందా? లేదా? అనే విషయంలో వైట్‌హౌస్ స్పష్టత ఇవ్వలేదు.














