భారత్ సంతతికి చెందిన మహిళను కీలక పదవిలో నియమించారని వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ సభ్యురాలిగా ఇండో అమెరికన్ శకుంతల ఎల్ భయ్యాను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారని వైట్ హౌస్ తెలిపింది. స్టేడ్ వైడ్ డెలావేర్ లా ఫర్మ్ సహ-యజమానిగా శకుంతల ఎల్ భయ్యా ఉన్నారు. గత ఏడేండ్లుగా ఆమె గవర్నర్ కార్నేయ్ జ్యుడీషియల్ నామినేటింగ్ కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. న్యాయవాద వ్రుత్తితోపాటు డెలావేర్ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అండ్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ సభ్యురాలిగా పని చేశారు. ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ హక్కుల పరిరక్షణ, వారి పిల్లల దత్తత, పని ప్రదేశాల్లో వివక్షపై పోరాడారు. డెలావేర్ బార్ అసోసియేషన్‌లో తొలి దక్షిణాసియా భారత్ మహిళగా ఉన్నారు. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ లా లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యాయవాదిగా డైవర్సిటీ, సమానత్వం కోసం పోరాడుతూనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
