బ్రిటన్‌లో కార్మికుల కొరత తీర్చే దిశగా ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు మరింత సమయం పనిచేసుకునేందుకు అనుమతిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైంగా పనిచేసుకోవచ్చు. ఈ పరిమితిని 30 గంటలకు పెంచే విషయమై ఇప్పటికే ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా, వివిధ పార్ట్‌టైం జాబ్స్ చేసుకునే అవకాశాన్ని కూడా ఫారిన్ స్టూడెంట్లకు ఇచ్చే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ చర్యలతో కార్మికుల కొరత నుంచి ఉపశమనం లభించడంతో పాటూ దేశానికి ఆర్థికంగా లాభిస్తుందని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.