అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల కేటాయింపులో సొంత ప్రభుత్వమే తీవ్ర పక్షపాతం చూపుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మునుగోడులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, తమ నియోజకవర్గానికి రావాల్సిన వాటా నిధులను తక్షణమే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కురుక్షేత్రం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకే నిధులు కుమ్మరించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తీరు కొనసాగుతోందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌పై, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌పై, భట్టి విక్రమార్క మధిరపై మాత్రమే ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కొడంగల్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు ఇస్తున్న సర్కారు, ఫ్లోరైడ్ పీడిత మునుగోడులో చెరువుల మరమ్మతుల కోసం కనీసం రూ. 500 కోట్లు కూడా ఇవ్వకపోవడం దారుణమని, డిండి ఎత్తిపోతల పనులు, చౌటుప్పల్ 100 పడకల ఆసుపత్రి హామీలు మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయని మండిపడ్డారు.

పార్టీ అంతర్గత సమావేశాల్లో వినతిపత్రాలు ఇస్తే బుట్టదాఖలు చేస్తున్నారని, అదే విషయాన్ని బయట ప్రశ్నిస్తే క్రమశిక్షణ చర్యల పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ నిధులపై నిలదీస్తే ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదని ఆయన హితవు పలికారు. మూడేళ్ల పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.















