ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా టైకూన్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 93 ఏండ్ల వయసులో ఐదో పెండ్లి చేసుకున్నారు. తన కంటే వయసులో 26 ఏండ్ల చిన్నవారైన రిటైర్డ్ జీవశాస్త్రవేత్త ఎలీనా జుకోవాను (67) వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. వీళ్లిద్దరు గత ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వివాహానికి అమెరికా ఫుట్‌బాల్ టీమ్ న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రోబెర్ట్ క్రాఫ్ట్, ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్ హాజరయ్యారు.
మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్ ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్‌ను వివాహం చేసుకుని, 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్ ని పెళ్లిచేసుకుని 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన ఆరేండ్లకే విడాకులు తీసుకున్నారు. తన రెండో భార్య అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.