ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించి సినిమా సార్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. వెంకీ అట్లూరి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఇలాంటి చిత్రాలను రూపొందించడం సాధారణ విషయం కాదు. దర్శక నిర్మాతలకు ఎంతో ధైర్యసాహసాలు కావాలి. ఆర్ట్, కమర్షియల్ అంశాలు కలిపిన చిత్రమిది. గొప్ప ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించారు. మనకు ఉచితంగా అందాల్సిన విద్య, వైద్యం ఇవాళ వ్యాపారం అయిపోయాయి. ధనుష్ భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఇష్టపడే నటుడు అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ నా తొలిప్రేమ సినిమా విజయం సాధిస్తే, ఈ సినిమా ఘన విజయం అందుకుంది. ఈ మూవీ చిత్రీకరణలో అహర్నిశలు కష్టపడిన మా బృందానికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ సినిమా విజయంపై మేము పెట్టుకున్న నమ్మకం నిజమైంది అన్నారు.
నటుడు సముద్రఖని మాట్లాడుతూ మనం జనాన్ని ప్రేమిస్తే వారు తిరిగి ప్రేమిస్తారు. సమాజాన్ని ప్రేమిస్తే సమాజం మనల్ని ప్రేమిస్తుంది. ఈ చిత్రం ద్వారా నేర్చుకునే మంచి విషయమిదే. ఇలాంటి కథ రాయాలంటే మంచి మనసు ఉండాలి. సమాజం పట్ల ప్రేమ ఉండాలి. ఈ చిత్రం చూశాక మన టీచర్లకు ఫోన్ చేసి మాట్లాడాలి అనిపిస్తుంది. పిల్లల చదువుల విషయంలో దిగువ మధ్య తరగతి కుటుంబాల బాధను చూపించిందీ సినిమా. ఇలాంటి సినిమాలో భా భాగమవడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. నాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నేను పోషించిన మీనాక్షి పాత్రకు మంచి స్పందన వస్తున్నది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణకు థాంక్స్. నా అభిమాన నటీనటులతో కలిసి ఈ చిత్రంలో నటించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది అని అన్నారు.